క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు మల బద్ధకం దూరంగా ఉంచుతాయి: ప్రముఖ జీర్ణాశయ వైద్య నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి

* ఆధ్వర్యంలో వైద్య సదస్సులో యశోద ఆసుపత్రి నిపుణుల ప్రసంగాలు

  * రోబోటిక్ శస్త్ర చికిత్సలతో మెరుగైన ఫలితాలు : ప్రముఖ యురాలజీ సర్జన్ :డాక్టర్ గోపీచంద్

  నంద్యాల : భారతీయ వైద్య సంఘం నంద్యాల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ సహకారంతో మధుమణి ఆసుపత్రి సమావేశ భవనంలో యూరాలజీ, జీర్ణాశయ చికిత్సలలో ఆధునిక విధానాల అంశంపై నంద్యాల ప్రాంత వైద్యులకు వైద్య సదస్సు నిర్వహించారు.నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు అధ్యక్షతన, కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్ నిర్వహణలో జరిగిన ఈ సదస్సులో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై సదస్సు ప్రారంభించారు.  సదస్సులో యశోద హాస్పిటల్ సీనియర్ యూరాలజీ శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ గోపీచంద్ రోబోటిక్ శస్త్ర చికిత్స-ప్రయోజనాల అంశంపై ప్రసంగిస్తూ రోబోటిక్ శస్త్ర చికిత్స వలన మూత్రపిండాలు, మూత్రశయం, ప్రోస్టేట్ శస్త్ర చికిత్సలలో మరింత మెరుగైన నిర్దిష్ట ఫలితాలు సాధించడానికి అవకాశం ఏర్పడిందన్నారు. ఆసుపత్రిలో ఉండే సమయం తగ్గుతుందన్నారు. శస్త్ర చికిత్స నిపుణులు రోబోటిక్ యంత్రాన్ని సమన్వయం చేస్తారన్నారు. మల బద్ధకం పై అపోహలన్న అంశంపై యశోద ఆసుపత్రి ప్రముఖ జీర్ణాశయ వైద్య నిపుణులు డాక్టర్ చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ క్రమబద్ధమైన ఆహారపు అలవాటు, ఆహారంలో తగిన మోతాదులో పీచుపదార్థాలు వాడడం ద్వారా మల బద్ధకం లేకుండా చూసుకోవచ్చు అన్నారు. మలబద్ధకం సమస్య ఎక్కువ కాలం కొనసాగినప్పుడు జీర్ణాశయ వ్యాధి నిపుణులను సంప్రదించడం అవసరమన్నారు. వక్తలను ఐఎంఏ నంద్యాల జ్ఞాపికలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఐఎంఏ నంద్యాల అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ పనిల్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, వెల్ఫేర్ స్కీమ్ వైస్ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్, నంద్యాల ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ సహదేవుడు, ఎగ్జిక్యూటివ్ ప్రతినిధి అక్బర్,అధిక సంఖ్యలో నంద్యాల ప్రాంత వైద్యులు పాల్గొన్నారు.

Share this