* ముఖ్యఅతిథిగా పాల్గొన్న టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్
నంద్యాల : ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా సర్వజన ఆసుపత్రిలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎపియుడబ్ల్యుజె గౌరవాధ్యక్షులు జనార్దన్ రెడ్డి, అధ్యక్ష, కార్యదర్శులు మధుబాబు, ఉస్మాన్ బాషా, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చలంబాబు, సీనియర్ పాత్రికేయులు రమణారెడ్డిలతో పాటు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ ఏపీయుడబ్లుజె ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం అభినందనీయమని, జర్నలిస్టులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. 68 సంవత్సరాలు పూర్తి చేసుకుని 69వ ఒడిలోకి వెళుతున్న ఏపీయుడబ్లుజె సంఘానికి అభినందనలు తెలిపారు. ఎందరో సీనియర్ పాత్రికేయులు ఈ సంస్థలో ఉండడం వల్ల సంస్థ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. జర్నలిస్టులకు నంద్యాల ప్రాంతంలో ఇంటి స్థలాలిచ్చే విషయాన్ని మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఏపీయూడబ్ల్యూజే నాయకులు మధు, చలం బాబు, జనార్ధన్ రెడ్డి, ఉస్మాన్ బాషాలు మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే సంస్థలో పనిచేయడం గర్వకారణమని, విలేకరుల అభివృద్ధికి తోడ్పాటు అందించే సంస్థ ఏపీడబ్ల్యూజే అని పేర్కొన్నారు. ఆగస్టు 17,1957 సంవత్సరంలో ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భవించిందని, అప్పటి నుండి ప్రతి ఏటా ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నట్లు వివరించారు. జర్నలిస్టులకు అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు, జర్నలిస్టులకు ఇంటి స్థలాలిచ్చి ఇళ్ళను నిర్మించి ఇవ్వాలని, జర్నలిస్టుల పిల్లలకు విద్యా సంస్థల్లో రాయితీలు ఇవ్వాలని తదితర సంక్షేమ పథకాల కోసం ఏపీయూడబ్ల్యూజే పోరాడుతుందని, అలాగే జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తేవాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఫిరోజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply