* పూర్వ విద్యార్ధులైన ప్రజా ప్రతినిధులకు సత్కారం
గుంటూరు : అత్యుత్తమ విద్యను అందించి, అభివృద్ధికి సోపానంగా నిలిచిన పాఠశాలల పురోభివృద్ధికి పూర్వ విద్యార్థులు తోడ్పడాలని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి కోరారు. ఆదివారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని వేంకటేశ్వర దేవస్థాన కళ్యాణ మండపంలో జరిగిన పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ పూర్వ విద్యార్ధులైన ప్రజా ప్రతినిధుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి స్కూలు పూర్వ విద్యార్థి మోదుగుల వాసుదేవ రెడ్డి అధ్యక్షత వహించారు. బ్రహ్మరెడ్డి మాట్లాడుతూ.. విద్య నేర్పి, విద్యార్థుల పురోభివృద్ధికి తోడ్పడిన పాఠశాలలకు జీవితాంతం రుణపడి ఉండాలన్నారు. ప్రజా ప్రతినిధి గానే కాకుండా, పూర్వ విద్యార్థిగా తనకు విద్యను నేర్పిన సీతారామయ్య హైస్కూల్ అభివృద్ధికి తుది శ్వాస వరకు కృషి చేస్తానన్నారు.
మైలవరం శాసన సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ..నాటి నుండి నేటి వరకు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా, సీతారామయ్య హైస్కూల్ విద్యారంగంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. వినయ విధేయతలు, నాయకత్వ పటిమ, కష్టించే తత్వం తనకు తన స్కూల్ ఇచ్చిన వరాలన్నారు.
గుంటూరు నగర మేయర్ కోవెలమూడి నాని మాట్లాడుతూ..తన ఉన్నతికి, సమాజంలో తన గౌరవప్రదమైన స్థానానికి సీతారామయ్య హైస్కూలే కారణమన్నారు. స్కూలు అభివృద్దే పూర్వ విద్యార్ధిగా తన ధ్యేయమన్నారు.పూర్వ విద్యార్థులు రాజకీయ నేత తాళ్ల వెంకటేష్ యాదవ్, పోలీసు ఎ.సి.పి గుంటుపల్లి శ్రీనివాస్, ప్రొఫెసర్ ద్వారక సుశీల తదితరులు మాట్లాడారు.
ఈ సందర్భంగా సీతారామయ్య హైస్కూల్ లో విద్యను అభ్యసించి, ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్న జూలకంటి బ్రాహ్మరెడ్డి, వసంత కృష్ణ ప్రసాద్, కోవెలమూడి రవీంద్ర లను పూర్వ విద్యార్థి సంఘ నాయకులు గోగినేని విజయ్ కుమార్, మోదుగుల వాసుదేవ రెడ్డి, జవహర్ ల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు అందచేసారు.అనంతరం సీనియర్ ఉపాధ్యాయులు రామ్మోహనరావు, పున్నయ్య, విజయకుమారి తో పాటు 40 మంది టీచర్లను సన్మానించారు. తొలుత సాంసృతిక కార్యక్రమాలు జరిగాయి.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మున్సిపల్ ఈ ఈ నాగమల్లేశ్వరరావు, అర్.వి.అర్ మాజీ ప్రిన్సిపాల్ కోట శ్రీనివాస్, డాక్టర్ యశోద, శాంతిశ్రీ, అనంత శేఖర్, గట్టినేని వెంకటేశ్వరరావు, మండలి శ్రీనివాస్, గుమ్మడి సీతారామయ్య చౌదరి, పెద్ది శ్రీనివాస్, దివాకర్, కొమ్మినేని కోటేశ్వరరావు, బంగారు బాబు తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply