గుంటూరు సిజిహెచ్ఎస్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ గా డాక్టర్ విద్య

గుంటూరు : స్థానిక పట్టణంలోని సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సిజిహెచ్ఎస్) వెల్నెస్ సెంటర్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ గా డాక్టర్ విద్య నియమితులయ్యారు. కలెక్టరేట్ ఎదురుగా గల సిజిహెచ్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఆమె బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ సిజిహెచ్ఎస్ నుండి బదిలీపై ఆమె గుంటూరుకు వచ్చారు. నూతన బాధ్యతలు చేపట్టిన డాక్టర్ విద్య ను సెంట్రల్ ఎక్సైజ్ పెన్షనర్స్ అసోసియేషన్ నేతలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ విద్య మాట్లాడుతూ..ఉద్యోగులు, పెన్షనర్ల పాలిట సంజీవిని సిజిహెచ్ఎస్ ను తీర్చిదిద్దటానికి తన వంతు కృషి చేస్తానన్నారు. విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్య సమస్యలు తెలుసుకొని వారికి తగిన ప్రాధాన్యతను ఇస్తానన్నారు. నాణ్యమైన మెరుగైన వైద్య సేవలందించటమే తమ లక్ష్యమన్నారు. వైద్య పరంగా అభివృద్ధి చెందిన గుంటూరులో సేవ చేసే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సెంట్రల్ ఎక్సైజ్ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు టి.వివేకానంద మాట్లాడుతూ..అందరూ అభిమానించే వైద్యురాలుగా డాక్టర్ విద్య మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. వైద్య వృత్తి అంటే సామాజిక సేవాభావంతో చేస్తున్న మహోపకారమన్నారు. సిజిహెచ్ఎస్ లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గుమ్మడి సీతారామయ్యచౌదరి మాట్లాడుతూ..ప్రతి వైద్యునికి సేవే కాకుండా, సంభాషణ శైలీ అవసరమన్నారు. వైద్యుడు ఇచ్చే భరోసా రోగి పూర్తి ఆరోగ్యవంతుడు అవ్వడానికి దోహదపడుతుందన్నారు. రోగుల బాగోగులు చూసే వైద్యులే ప్రజల పాలిట కనిపించే దైవాలన్నారు. అనంతరం డాక్టర్ విద్య కు పలువురు ఉద్యోగులు, పెన్షనర్లు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందించారు. తొలుత సిజిహెచ్ఎస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి.సిహెచ్. కోటేశ్వరరావును డాక్టర్ విద్య మర్యాద పూర్వకంగా కలిసి, ఆయన ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, జిఎస్టీ పెన్షనర్స్ సంఘం నేతలు గద్దె తిలక్, టి.వివేకానంద, గుమ్మడి సీతారామయ్యచౌదరి, పి.వి.సత్యనారాయణ, కె.సామ్రాజ్యం, పి.కోటేశ్వరరావు, ఎన్.ఎస్.నగేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Share this