ఆర్ జి యం డైరెక్టర్ కు ఎడ్యుకేషన్ చేంజ్ మేకర్ అవార్డు

నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ డివి అశోక్ కుమార్ ఎడ్యుకేషన్ చేంజ్ మేకర్ అవార్డు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయచంద్ర ప్రసాద్ తెలిపారు. గురువారం కళాశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబరు 30వ తేదీన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ ఐసిటి (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ)అకాడమీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన అవార్డు ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో ఆయనకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్  డాక్టర్ కే.మధుమూర్తి, కాకినాడ జేఎన్టీయూ వైస్ ఛాన్స్లర్ సిఎస్ ఆర్కె ప్రసాద్, ఐసిటి సీఈవో వి.శ్రీకాంత్ చేతులమీదుగా ప్రతిష్టాత్మక ఎడ్యుకేషన్ చేంజ్ మేకర్ అవార్డును  అందుకున్నారన్నారు. విద్య ఒక వృత్తిగా గాక సమాజ నిర్మాణానికి సాధనంగా కృషిచేసి నందుకు, విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంపొందించడం, ఉపాధ్యాయుల్లో బాధ్యత భావాన్ని నాటడం, విద్యా సంస్థల ద్వారా సమాజానికి విలువలు అందించడం వంటి కార్యక్రమాలలో కృషి చేసినందుకుగాను అవార్డుకు ఎంపికైనట్టు తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ ను ఆర్జీఎం విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎం శాంతి రాముడు, ఎండి శివరాం, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.