రాయలసీమ స్థాయి వైద్య వైజ్ఞానిక సదస్సు కరపత్రాలు విడుదల చేసిన ఐ ఎం ఏ నాయకులు

*    రాష్ట్ర ఐఎంఏ, ఏపీ మెడికల్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో

*    నిర్వహణ ఐఎంఏ నంద్యాల

*   మంత్రి ఫరూక్ తో సదస్సు ప్రారంభం

*   ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, వైద్య విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ చంద్రశేఖర్, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరి రావు పాల్గొంటారు

*   సదస్సులో పాల్గొనడానికి ప్రతినిధులుగా నమోదు చేసుకున్న 700 మంది వైద్యులు

*   12 మంది వివిధ రంగాల వైద్య నిపుణుల ప్రసంగాలు

నంద్యాల  : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాల ఐఎంఏ నిర్వహణలో ఈ నెల 27వ తేదీ ఆదివారం నంద్యాలలో సౌజన్య కన్వెన్షన్ సెంటర్లో రాయలసీమ, నెల్లూరు జిల్లాలతో కూడిన ఐఎంఏ జోన్ 3 ప్రాంతీయ వైద్య వైజ్ఞానిక సదస్సు నిర్వహిస్తున్నారు.  ఈ సందర్భంగా మధు మణి సమావేశ భవనంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో సదస్సు నిర్వాహక చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ, నిర్వాహక కార్యదర్శి డాక్టర్ మధుసూదన్ రెడ్డి, ఐఎంఏ నంద్యాల అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ పనిల్ కుమార్, సదస్సు వైజ్ఞానిక కమిటీ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్, వైజ్ఞానిక కమిటీ కార్యదర్శి, రాష్ట్ర ఐఎంఏ ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర రెడ్డి సదస్సు వివరాలు తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జి.నందకిషోర్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం లో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ మంత్రి ఎన్ఎండి ఫరూక్  ముఖ్య అతిథిగా పాల్గొని సదస్సు ప్రారంభిస్తారు. గౌరవ అతిథులుగా నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహరి రావు, రాష్ట్ర వివిధ ప్రాంతాల నుండి వచ్చే ఐఎంఏ జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు.ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే వైద్య వైజ్ఞానిక సదస్సులో 12 మంది వివిధ వైద్య రంగాలకు చెందిన నిపుణులు వివిధ అంశాలపై మల్టీమీడియా సహకారంతో ఉపన్యాసాలు ఇవ్వడం జరుగుతుంది. రాయలసీమ  లోని కర్నూలు అనంతపురం, కడప, చిత్తూరు ఉమ్మడి జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా నుంచి 700 మంది వైద్యులు సదస్సులో పాల్గొనడానికి ప్రతినిధులుగా నమోదు చేసుకున్నారు.ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ వైద్యులు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మెడికల్ కౌన్సిల్  లో తమ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని ఆ సమయంలో నిరంతర వైద్య విద్య పాయింట్లు సంవత్సరానికి ఆరు  చొప్పున 30 పాయింట్ల సర్టిఫికెట్స్ జతపరచవలసి ఉంటుందన్నారు. ఈ సదస్సుకు హాజరైన వారికి ఏపీ మెడికల్ కౌన్సిల్ రెండు పాయింట్ల సర్టిఫికెట్ ను అందజేస్తారని తెలిపారు. వైద్యంలో వస్తున్న ఆధునిక విధానాల పట్ల, నూతన పరికరాల పట్ల వైద్యులు నిరంతరం అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన, నాణ్యమైన ఆధునిక చికిత్సలు అందించడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. ఈ వైద్య వైజ్ఞానిక సదస్సుల నిర్వహణ ప్రధాన ఉద్దేశం ఇదే అని తెలిపారు.సదస్సుకు ఏపీ మెడికల్ కౌన్సిల్ పరిశీలకులుగా శాంతిరాం వైద్య కళాశాల మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవిని మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరి రావు నియమించారు.

సదస్సులో ప్రసంగిస్తున్న వైద్య నిపుణులు :

ఒమేగా క్యాన్సర్ ఆసుపత్రి క్యాన్సర్ నిపుణులు డాక్టర్ రవీంద్ర, అపోలో ఆసుపత్రి న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ సురేష్, హైదరాబాద్ యశోద ఆసుపత్రి హెమటాలజీ నిపుణులు డాక్టర్ అశోక్, యశోద ఆసుపత్రి క్రిటికల్ కేర్ శాకాధిపతి డాక్టర్ మిశ్రా, అపోలో ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ ధనుంజయ రావు,శాంతిరాం వైద్య కళాశాల మైక్రో బయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి,కర్నూలు విశ్వభారతి వైద్య కళాశాల సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ బి.జి.రాహుల్, నంద్యాల ఉదయానంద ఆసుపత్రి గుండె వైద్య నిపుణులు డాక్టర్ రామేశ్వర్ రెడ్డి, నంద్యాల మధుమణి చెవి ముక్కు గొంతు శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ చిత్తలూరి మణిదీప్, శాంతిరాం వైద్య కళాశాల ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి సదస్సులో వివిధ అంశాలపై ప్రసంగిస్తారు.

Share this