* మాతృభూమికి కళార్చన పోటీల పుస్తకాలను ఆవిష్కరించిన మంత్రి ఫరూక్
* సెప్టెంబర్ 1 నుండి 14వ తేదీ వరకు పాఠశాల స్థాయి బాలలకు వివిధ అంశాలలో పోటీలు
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సహకారంతో కళారాధన, ఐఎంఏ, లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణ
నంద్యాల : కళారాధన సాంస్కృతిక సంస్థ గత 24 సంవత్సరాలుగా ఆగస్టులో దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మాతృభూమికి కళార్చన పేరిట పాఠశాల విద్యార్థులకు వివిధ రకాల అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఆగస్టులో జరిగిన పాఠశాలల పరీక్షల నేపథ్యంలో ఈ పోటీలను ఈ సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుండి 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పోటీల వివరాలతో రూపొందించిన పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. కళారాధన అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ రవి కృష్ణ ల నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఫరూక్ మాట్లాడుతూ కళారాధన సాంస్కృతిక సంస్థ ఈ సంవత్సరం రజతోత్సవ ఉత్సవాలను నిర్వహిస్తున్నారని, పాతిక సంవత్సరాలుగా నిర్విరామంగా, క్రమం తప్పకుండా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి నంద్యాలలో కళల వైభవానికి, నంద్యాల కళా వైభవాన్ని దేశవ్యాప్తం చేయడంలో కళారాధన కృషి ప్రశంసనీయమన్నారు. డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ మధుసూదనరావు కళల అభివృద్ధికి కోసం చేసిన సేవలు అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారని, కళా రత్న, ఉగాది పురస్కారాలు, కందుకూరి నాటకరంగ పురస్కారాలు, నంది పురస్కారాలు పునరుద్ధరించారని అన్నారు. అలాగే డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ నుండి 14వ తేదీ వరకు అనేక పోటీలను పాఠశాల విద్యార్థులకు 3 వయస్సు కేటగిరీలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సహకారంతో, కళారాధన, నంద్యాల ఐఎంఏ, లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో ఈ పోటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత 24 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ పోటీలను ఒక జాతీయ నాయకునికి అంకితం చేస్తూ వారి ఫోటోతో కూడిన మొమెంటోలనుబహుమతులుగాఅందజేస్తున్నామని, ఈ సంవత్సరం మాతృభూమికి కళార్చన పోటీలను మహా కళాకారుడు, తెలుగుజాతి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కు అంకితం చేస్తూ , ఆయన చిత్ర పటంతో కూడిన బహుమతి షీల్డ్ లు రూపొందించి అందజేస్తామన్నారు. పోటీల వివరాలకు బాలాజీ కాంప్లెక్స్ లో ఉన్న కళారాధన కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.ఫోన్ ద్వారా వివరాలు తెలుసుకోవడానికి 8142962974, 63 00 71 5927, 79 89 627760 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
పోటీలు నిర్వహించే అంశాలు : మూడవ తరగతి వరకు సబ్ జూనియర్, నాలుగో తరగతి నుండి ఏడవ తరగతి వరకు జూనియర్, 8 9 10 వ తరగతి వారు సీనియర్ విభాగాలుగా పోటీల నిర్వహిస్తారు.
లఘు చలనచిత్ర విశ్లేషణ, చిత్రపట విశ్లేషణ, కవితా రచన, లేఖ రచన, పూర్తిగా తెలుగులో మాట్లాడడం దేశభక్తి, సాధారణ, జానపద, శాస్త్రీయ పాటల పోటీలు, వాద్య సంగీతం, స్కిట్స్, మూకాభినయం, మిమిక్రీ , ఆంగ్ల రైమ్స్, పద్య పఠనం, తెలుగు, హిందీ ,ఇంగ్లీష్ భాషలలో చక్కటి చేతి రాత,కథ చెబుతా వింటారా, వ్యాస రచన, వక్తృత్వ పోటీలు, శాస్త్రీయ, జానపద, ఆధునిక, నృత్య పోటీలు, దేశభక్తి బృంద నృత్యాలు, ఏకపాత్రాభినయం, సంస్కృత శ్లోకాలు, కవితా గానం, చిత్రలేఖనం,స్పాట్ డ్రాయింగ్, క్విజ్ ,వేషధారణ పోటీలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో కళారాధన ఉపాధ్యక్షులు ఏవిఆర్ ప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శి పత్తి రంగనాథ్, సంయుక్త కార్యదర్శి సోమేసుల నాగరాజు, జానపద కళా విభాగ సహాయ కార్యదర్శి రామసుబ్బయ్య, సాంకేతిక విభాగం సహాయ కార్యదర్శి షేక్ మజీద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు పాల్గొన్నారు.
Leave a Reply