* డాక్టర్ రవి కృష్ణ సాంస్కృతిక, సామాజిక సేవలు ప్రశంసనీయం : నంద్యాల వైద్యులు
* నంద్యాలకు గర్వకారణం డాక్టర్ రవి కృష్ణ: ఐఎంఏ, నంద్యాల
నంద్యాల : ఏప్రిల్ 16వ తేదీ, సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం 177 వ జయంతి రోజున రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో నిర్వహించిన తెలుగు నాటక రంగ దినోత్సవంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్రస్థాయి కందుకూరి ప్రతిష్టాత్మక రంగ స్థల లక్ష రూపాయల నగదు పురస్కారం, ప్రశంసాపత్రం అందుకున్న డాక్టర్ రవి కృష్ణను ఐఎంఏ, నంద్యాల తరపున పలువురు వైద్యులు శాలువలు, పూలమాలలు,జ్ఞాపికలతో సత్కరించి అభినందించారు. సూరన సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ సహదేవుడు, ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ డాక్టర్ రవి కృష్ణ దర్శకత్వంలో కళారాధన సంస్థ ద్వారా సామాజిక చైతన్యం కలిగించే సాంఘిక నాటకాలు, పద్య పౌరాణిక నాటకాలు, బాలలలో సామాజిక స్పృహ పెంచడానికి బాలల నాటికలు అనేకం రూపొందించి రాష్ట్ర ప్రభుత్వ నంది నాటకోత్సవాలలో, రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలలో వందలాది ప్రదర్శనలు చేసి నంద్యాల కళావైభవాన్ని రాష్ట్ర,దేశ వ్యాప్తంగా తీసుకు వెళ్లడం జరిగిందన్నారు. నంద్యాలకు దాదాపు 20 నంది బహుమతులు తీసుకురావడం జరిగిందన్నారు. 2017లో ఉగాది పురస్కారం, 2018లో కళా రత్న హంస పురస్కారం అందుకున్న డాక్టర్ రవి కృష్ణకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కందుకూరి రంగస్థల రాష్ట్ర స్థాయి పురస్కారం అందించడం నంద్యాలకు గర్వకారణం అన్నారు. డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ కళారాధన సంస్థ 2000 సంవత్సరంలో ప్రారంభించబడిందని, 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నదని, రజతోత్సవ వేడుకల్ని సంవత్సరం పొడవునా నిర్వహించదలచామని తెలిపారు. కళారాధన కార్యక్రమాలకు గత పాతిక సంవత్సరాలుగా నంద్యాల వైద్యులు అందించిన సహకారం మరువలేనిదన్నారు.ఈ కార్యక్రమంలో ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు,రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ వసుధారాణి, డాక్టర్ పనిల్ కుమార్, సీనియర్ వైద్యులు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ బచ్చు సత్యనారాయణ, డాక్టర్ ఓబులరెడ్డి,డాక్టర్ నాగమణి, అధిక సంఖ్యలో నంద్యాల వైద్యులు పాల్గొన్నారు.
Leave a Reply