* అభినందించి సత్కరించిన మంత్రి ఫరూక్
* థాయిలాండ్ లో జరిగిన అంతర్జాతీయ పారా సైక్లింగ్ లో 12 స్వర్ణ పతకాలు సాధించిన ఆర్షద్
* ప్రపంచ పారా సైక్లింగ్ ర్యాంకింగ్ లో ప్రథమ స్థానానికి చేరుకున్న అర్షద్
నంద్యాల : థాయిలాండ్ లో చియాంగ్ మయి నగరంలో జూలై నెలలో యూనియన్ సైక్లింగ్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో థాయిలాండ్ పారా సైక్లింగ్ అసోసియేషన్ నిర్వహణలో జరిగిన రెండవ లానా పారా సైక్లింగ్ కప్ ఛాంపియన్ షిప్ లో ఆదిత్య మెహతా ఫౌండేషన్ తరపున పాల్గొన్న నంద్యాల దివ్యాంగ పారా సైక్లింగ్ క్రీడాకారుడు వివిధ కేటగిరీలలో ట్రాక్ మరియు రోడ్డు సైక్లింగ్ పోటీలలో 12 బంగారు పతకాలు సాధించాడు. అర్షద్ ఈ విజయాలతో ప్రపంచ పారా సైక్లింగ్ ర్యాంకింగ్ లో ప్రథమ స్థానానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ నిర్వహణలో రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ క్యాంపు కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమంలో మంత్రి ఫరూక్ అర్షద్ ను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ అర్షద్ చిన్నతనంలో ప్రమాదంలో కాలు కోల్పోయినప్పటికీ క్రీడల పట్ల మక్కువతో వివిధ క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం నంద్యాలకు, రాష్ట్రానికి గర్వకారణం అన్నారు. అర్షద్ సాధించిన విజయాలుదివ్యాంగులకుస్ఫూర్తిదాయకమన్నారు.చిన్నప్పటి నుండి అర్షద్ ను డాక్టర్ రవి కృష్ణ ప్రోత్సహించాడని అభినందించారు.రాష్ట్ర నూతన క్రీడా విధానంలో అంతర్జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారులు, దివ్యాంగ క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయని, అర్షద్ ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దగ్గరికి తీసుకువెళ్లి మంచి ఉద్యోగం రావడానికి సహకరిస్తానన్నారు. అలాగే డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ అర్షద్ పారా సైక్లింగ్ లోనే కాకుండా, పర్వతారోహణలో మౌంట్ భగీరధి అధిరోహించాడని, అదేవిధంగా స్విమ్మింగ్, బాడీ బిల్డింగ్, వీల్ చైర్ ఫెన్సింగ్ , ఆర్చరీ వంటి క్రీడలలో కూడా రాష్ట్ర జాతీయ స్థాయిలో పతకాలు సాధించి ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచాడని అన్నారు. అర్షద్ మాట్లాడుతూ ఈనెల బెల్జియంలో జరగనున్న ప్రపంచ రోడ్డు సైక్లింగ్ ఛాంపియన్ షిప్ లో పాల్గొనడానికి వెళ్తున్నానని తెలిపాడు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల అధ్యక్షుడు ఖలీల్ మనియార్, తెలుగుదేశం పార్టీ నాయకుడు జిలాని, అర్షద్ తండ్రి ఇస్మాయిల్ పాల్గొన్నారు.
Leave a Reply