రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అవయవ దానం చేసిన మహిళ సుజాత పార్థివ దేహానికి ఘన నివాళులు

నంద్యాల :  జిల్లాలో మొదటి సారిగా అవయవదానం చేసిన మహిళ సుజాత పార్థివ దేహానికి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. రెడ్ క్రాస్ ప్రెసిడెంట్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గనియా ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ విశ్వనాథ్, పంచాయతీ అధికారి శివారెడ్డి, డిఎస్పి మంద జావలిన్, మంత్రి ఫరూక్ గారి కుమారుడు, టిడిపి రాష్ట్ర నాయకులు ఎన్ఎండి ఫయాజ్, నంద్యాల అర్బన్, రూరల్ తాసిల్దారులు ప్రియదర్శిని, శ్రీనివాసులు, మూడో పట్టణ సీఐ కంబగిరి రాముడు, రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల, కోశాధికారి నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు ఉస్మాన్ భాష, రెడ్ క్రాస్ సీనియర్ నాయకులు నాగేశ్వర్రెడ్డి, మండల నాయకులు సోహెల్, మాస్టర్ స్కూల్ కరస్పాండెంట్ హలీమా, స్కూల్ సిబ్బంది విద్యార్థులు మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. రెడ్ క్రాస్ విజ్ఞప్తి మేరకు జిల్లా ఎస్పీ అవయవ దాత సుజాత పార్థివదేహానికి నంద్యాల నుండి స్వగ్రామం వరకు పోలీస్ ప్రోటోకాల్ వాహనాలను ఏర్పాటు చేసి పోలీస్ శాఖ తరపున ఘన నివాళులర్పించారు. నంద్యాల మండలంలోని గుంతనాల గ్రామానికి చెందిన బోప్ప నాగేంద్ర గౌడ్ కుమార్తె సుజాత గోస్పాడు మండలం తేల్లపూరి గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ గత మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై నంద్యాలలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కు గురయ్యారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు నాగేంద్ర గౌడ్, శేషమ్మ, సోదరి విజయలక్ష్మి, సోదరుడు నాగ సునీల్, రవి తదితరులు సుజాత కోరిక మేరకు అవయవ దానం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ నంద్యాల రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరిని సంప్రదించగా మెరుగైన సౌకర్యాల కోసం కర్నూలుకు పంపడం జరిగింది.  కర్నూలు రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ కేజీ గోవింద్ రెడ్డి సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవన్ దాన్ ట్రస్ట్ వారి సూచన మేరకు కిమ్స్ హాస్పిటల్ లో సుజాత దేహం నుండి రెండు కళ్ళు, రెండు కిడ్నీలు, గుండె, రెండు ఊపిరితిత్తులు సేకరించి అవసరమైన 6 మంది జీవితాలలో వెలుగులు నింపారు. పార్థివదేహం కర్నూలు నుండి నంద్యాల బొమ్మలసత్రము చేరుకున్న వెంటనే పూలవర్షం కురిపించారు. జిల్లా అధికారులు, పోలీసు అధికారులు ప్రజా ప్రతినిధులు పలు సంఘాల నాయకులు నివాళులర్పించారు. పోలీస్ వాహనాలతో, ప్రోటోకాల్ వాహనాలతో స్వగ్రామము గుంతనాలకు పార్థివదేహాన్ని చేర్చడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్, జిల్లా కలెక్టర్ సహకారంతో జిల్లాలో మొట్ట మొదట అవయవదానం చేసిన సుజాతకు ఘన నివాళులర్పించడానికి జిల్లా అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, మీడియా తదితర సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అవయవదానానికి సహకరించిన సుజాత కుటుంబ సభ్యులకు రెడ్ క్రాస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Share this