* విజేతలు రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా జట్టులో పాల్గొంటారు
* చదరంగం ఏకాగ్రతను పెంచుతుంది: డాక్టర్ రవి కృష్ణ
నంద్యాల : జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో, జిల్లా చదరంగం సంఘం ప్రధాన కార్యదర్శి రామ సుబ్బా రెడ్డి నిర్వహణలో మంగళవారం సంజీవ నగర్ లో ఉన్న రామకృష్ణ విద్యాలయం ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో 11సంవత్సరాల లోపు బాల బాలికల జిల్లా స్థాయి చదరంగం పోటీలు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ముఖ్య అతిథిగా, గౌరవ అతిథులుగా ఎన్.ఆర్.జి .చెస్ అకాడమీ గౌరవాధ్యక్షులు రాజేష్, క్రీడాభారతి జిల్లా కార్యదర్శి నిమ్మకాయల సుధాకర్ పాల్గొన్నారు. డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ చదరంగం క్రీడ ఏకాగ్రతను ఇనుముడింప చేస్తుందని తద్వారా చదువులో కూడా రాణించడానికి అవకాశాలు అధికమవుతాయని అన్నారు. మొబైల్ ఫోన్ పిల్లలలో దుష్ప్రభావం చూపుతున్నదని, దాని నుంచి పిల్లల దృష్టి క్రీడలపై ఉండేలా చేస్తే పిల్లల మేధో వికాసం జరుగుతుందన్నారు. నిమ్మకాయల సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు, కళలు వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని అన్నారు. రాజేష్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలలో పాల్గొంటే క్రమశిక్షణ కూడా అలవడుతుందని, తల్లిదండ్రులు విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించాలని కోరారు. డాక్టర్ రవికృష్ణ,రాజేష్ చదరంగం బోర్డుపై పావులు కదిలించి పోటీలు లాంచనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామ సుబ్బారెడ్డి, క్రీడాభారతి జిల్లా కార్యదర్శి నిమ్మకాయల సుధాకర్, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ రాజేష్ లతోపాటు ఆర్బిటర్ సుజాత, వ్యాయామ ఉపాధ్యాయులు కళ్యాణ చక్రవర్తి, వందమంది క్రీడాకారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Leave a Reply