డాక్టర్ గుర్రాల రవి కృష్ణకు ప్రభుత్వ రాష్ట్రస్థాయి కందుకూరి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారం

*   రాష్ట్రస్థాయి పురస్కారానికి ఎంపికైన ముగ్గురిలో డాక్టర్ రవి కృష్ణ ఒకరు
*   ప్రశంసా పత్రం, లక్ష నగదు బహుమతి
*   బుధవారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పురస్కార ప్రదానం
ఫోటో : రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కందుకూరి రాష్ట్రస్థాయి  పురస్కారానికి ఎంపికైన డాక్టర్ గుర్రాల రవికృష్ణ
ప్రజాపవర్ నంద్యాల : కందుకూరి వీరేశలింగం 177వ జయంతి, ఏప్రిల్ 16 వ తేదీన తెలుగు నాటక రంగ దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కందుకూరి రాష్ట్రస్థాయి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారాలను మంగళవారం విజయవాడలో ప్రకటించింది. రాష్ట్రస్థాయి పురస్కారానికి ముగ్గురిని ఎంపిక చేయగా అందులో నంద్యాలకు చెందిన డాక్టర్ గుర్రాల రవికృష్ణ ఒకరు.  ప్రశంసా పత్రం, లక్ష రూపాయల నగదు బహుమతితో రాష్ట్ర ప్రభుత్వం సత్కరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ ,నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రాష్ట్రస్థాయి పురస్కారాలతో పాటు, 107 మందికి పదివేల రూపాయల జిల్లా స్థాయి కందుకూరి విశిష్ట పురస్కారాలను కూడా అందజేయనున్నారు.డాక్టర్ గుర్రాల రవికృష్ణ 2000 సంవత్సరంలో నంద్యాలలో కళారాధన సాంస్కృతిక సంస్థ స్థాపించి గత 25 సంవత్సరాలుగా కళా, నాటక రంగాలకు చేసిన విశిష్ట సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవార్డు కమిటీ ఎంపిక చేసింది. డాక్టర్ రవి కృష్ణ గతంలో 2017లో ఉగాది తెలుగు తల్లి పురస్కారం, 2018లో కళా రత్న హంస పురస్కారం అందుకున్నారు.కథ, నాటక రచయితగా శకలాలు కథా సంపుటి, రాయలసీమ ఫ్యాక్షనిజం నిజస్వరూపం బహిర్గతం చేసిన కబంధహస్తాలు,యువత సామాజిక బాధ్యతను గుర్తు చేసే అంకురం సాంఘిక నాటకాలు డాక్టర్ రవి కృష్ణ రచించడమే కాకుండా,దర్శకుడిగా, ప్రయోక్తగా, రూపుకర్తగా వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్ర, సుమంగళి భవ రావణ ధాన్యమాలి, మృత సంజీవని వంటి పద్య పౌరాణిక నాటకాలు, వామనవృక్షం,ఇక్కడ కాసేపు ఆగుదాం, పత్ర హరితం, ఒంటి స్తంభం మేడ, దోసిట్లో సముద్రం, నాలుగు వేళ్ళు నా వైపే,బానిస మొదలైన సాంఘిక నాటకాలు, రాష్ట్ర ప్రభుత్వ నంది నాటక పోటీలలో బాలల నాటక విభాగంలో వరుసగా ఏడు సంవత్సరాలు మనకెందుకులే, జయ జయ జయహే, నిమజ్జనం, ఆకలి, అపురూపం, సీతాకోకచిలుక, భళా డింగరి నాటికలను ప్రదర్శించారు. వరుసగా ఏడు సంవత్సరాలు నంది నాటక పోటీల్లో బాలల విభాగంలో నాటికలు ప్రదర్శించి నంది పురస్కారాలను అందుకున్న ఏకైక సంస్థ నంద్యాల కళారాధన.రెండు బంగారు నందులు నాలుగు వెండి నందులు, ఒక కాంస్య నంది డాక్టర్ రవి కృష్ణ రూపొందించిన నాటకాలకు ఉత్తమ ప్రదర్శన బహుమతులుగా అందుకోవడమే కాకుండా, ఉత్తమ దర్శకుడిగా కాంస్య నంది అవార్డు అందుకున్నారు.
డాక్టర్ రవికిష్ణ ఆధ్వర్యంలో కళారాధన పద్య పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు,  బాలల నాటికలు రాష్ట్ర, దేశంలోని వివిధ ప్రాంతాలలో, కువైట్ లో దాదాపు 500 ప్రదర్శనలు ఇచ్చి 100 కు పైగా బహుమతులను వివిధ పరిషత్తు నాటక పోటీలలో అందుకున్నారు.డాక్టర్ రవి కృష్ణ నటుడిగా వామనవృక్షం, కబంధహస్తాలు, అంకురం నాటకాలలో ప్రధాన పాత్రల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రదర్శనలు ఇచ్చారు. నంద్యాలలో నంది నాటక ఉత్సవాలను రెండుసార్లు ఘనంగా నిర్వహించడంలో కీలకపాత్ర వహించడమే కాకుండా, కళావైభవం, నంద్యాల ఉత్సవాల పేరిట రాష్ట్ర స్థాయి నాటకోత్సవలను అనేకసార్లు నంద్యాలలో  నిర్వహించారు.నంద్యాల కళా రంగ వైభవాన్ని రాష్ట్రంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లడంలో విశేష కృషి చేసిన డాక్టర్ రవి కృష్ణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కందుకూరి ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి పురస్కారం రావడం పట్ల ప్రముఖ న్యాయవాది వెదుర్ల రామచంద్రరావు, కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు ,నాటక విభాగ కార్యదర్శి, కళా రత్న పురస్కార గ్రహీత ఎస్ అర్ ఎస్ ప్రసాద్, రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, గురు రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ దస్తగిరి రెడ్డి, లయన్స్ క్లబ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ కౌన్సిల్ చైర్మన్ ఏవిఆర్ ప్రసాద్, లయన్స్ క్లబ్, కళారాధన సభ్యులు, ఐఎంఏ వైద్యులు హర్షం ప్రకటించి డాక్టర్ రవి కృష్ణకు అభినందనలు తెలిపారు.

Share this