ప్రజాపవర్ ప్రకాశం జిల్లా/ రాచర్ల : రంగ అనే చెంచులక్ష్మి వలెనేరంగనాయకస్వామిగా పూజలందుకుంటున్న శ్రీమహావిష్ణువు- మయూర మహర్షి – ముక్కుతో తవ్విన గుండమే నెమలి గుండ్ల క్షేత్రం.ప్రకృతి సంపదలకు, జీవనదులకు ప్రాణప్రదమైన నల్లమల అడవుల పరీవాహక ప్రాంతంలో ఎన్నో మహిమాన్విత క్షేత్రరాజాలున్నాయి.వాటి వరుసలోనే భక్తులకు కొంగు బంగారమై నెమలిగుండ్ల ‘రంగనాయకస్వామి’ క్షేత్రము అలరారుచున్నది.నెమలిగుండం రంగనాయక స్వామి ఆలయం :ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అతిపురాతనమైన ఆలయంగా పేర్కొంటారు. గర్భగుడిలో రంగనాథస్వామి నిజరూపంలో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత.త్రేతాయుగం కాలం నుంచీ ఈ ఆలయంలో స్వామి పూజలు అందుకుంటున్నట్లు చెబుతారు.
శనివారం మాత్రమే దర్శనం : శనివారం ఉదయం 6 గంటలకు తెరుచుకునే తలుపులు సాయంత్రం 6కు తిరిగి మూసుకుంటాయి.ఆ తర్వాత ఇక్కడ ఒక్కరంటే ఒక్కరూ ఉండరు.ఆ రోజు స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా బారులు తీరుతారు.ఇక్కడకు మన రాష్ట్రంనుండేగాక,ఇతర ప్రాంతాలనుండి వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుండి చైత్రమాసం పౌర్ణమినాడు విశేషంగా భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించటం పరిపాటి. ఈ ప్రాంత ప్రజలు రంగడు,రంగమ్మ,రంగస్వామి అను పేర్లతో తమ సంతానాన్ని పిలుచుకోవడం అనాదిగా ఉంది. ఈ క్షేత్రమునకు మూడు వైపులా ఉన్న కొండలను ‘శ్రీరంగం కొండల’ని పిలుస్తారు.
స్థల పురాణం : నల్లమల్ల కొండలలో చెంచు జాతికి చెందిన బయన్న, బయ్యక్క దంపతులుండేవారు. వారి ఏకైక కుమార్తె పేరు రంగ (చెంచులక్ష్మి).ఒకానొక రోజు ఆమె తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయడానికి సంకల్పించారు.కాని చెంచులక్ష్మి ( రంగ ) తనకు ఈ పెళ్లి వద్దని తాను శ్రీమన్నారాయణుని ప్రేమిస్తున్నానని ఆయననే వివాహమాడుతానని పట్టు పట్టడంతో వారి కుటుంబాన్ని కులసంఘం పెద్దలు వెలివేశారు.రంగ చెంచుగూడెం వదలి నెమిలిగుండం చేరుకొని తపమాచరిస్తున్న మయార మహర్షికి తన మనోగతాన్ని వెల్లడి చేసింది.ఆ సమయంలోనే శ్రీమన్నారాయణుని సేవించే ‘మయూర మహర్షి’ ఆమెకు ‘నీ కోరిక తీరడానికి తపస్సే మంచిమార్గమని సెలవిచ్చారు. శ్రీమన్నారాయణుని సందర్శనము కోసం ‘మయూర మహర్షి’ , వివాహము చేసుకోవాలని చెంచులక్ష్మి (రంగ ) ఇరువురూ ఘోర తపస్సుకు పూనుకొన్నారు.వీరిరువురి అభీష్టములు నెరవేర్చడానికి వైకుంఠవాసుడే తరలి వచ్చాడు.
చెంచులక్ష్మి భక్తిని మెచ్చిన శ్రీమన్నారాయణుడు ఆమెను వివాహమాడి ఈ నెమలిగుండ్లలోనే రంగనాయకస్వామిగా నివాసమేర్పరుచుకొన్నాడు.
శ్రీమన్నారాయణుడిని సేవించే మయూర మహర్షి కోరిక నిమిత్తమై తాను ఇక్కడే కొలువై భక్తుల కోరికలను తీరుస్తానని వరాలనిచ్చిన స్వామి శిలా రూపాన్ని పొందాడు.అంతేగాక ఈ ప్రదేశము రంగనాయక క్షేత్రముగా విరాజిల్లగలదని ఆశీర్వదించాడు. అపుడు శిలారూపాన్ని పొందిన స్వామియే నేటి నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయము.
నెమలిగుండ్లు అని పేరు వెనక గాథ : ఒకప్పుడు మయూరమహర్షి అనే ముని ఇక్కడ ఆశ్రమం నిర్మించుకొని విష్ణువును గూర్చి తపస్సు చేసేవాడు.అతడు ఒకనాడు తనముక్కుతో ఒక కొలను పటం గీచాడని,మరుసటి ఉదయం అక్కడ ఒక కొలను (గుండం లేదా గుండ్లు) వెలసిందని ప్రతీతి.ఆ కొలను మయూరం (నెమలి) ఆకారంతో ఏర్పడిందని,ఆకారణంగా నెమలిగుండం అని నెమలిగుండ్ల అని పేరు వచ్చిందని చెబుతారు.అందుకే ఇక్కడ వెలసిన రంగనాయకస్వామి ఆలయం నెమలిగుండ్ల రంగనాయక క్షేత్రంగా పేరుపొందిందని చెబుతారు .
దేవాలయానికి ఎదురుగా నెమలి గుండము ఉంది. దీనినే తూర్పు పీట అని కూడా పిలుస్తుంటారు. ఈ తూర్పు పీటకు చివర రంగనాయకస్వామి వారి శంఖు,చక్ర,నామాలు కన్పిస్తుంటాయి.కాని ఈ దృశ్యాలన్నీ కూడా కేవలం భక్తితత్పరులకు మాత్రమే గోచరమవుతాయని అంటారు.
ఇతరదైవాలు : నెమలిగుండ్ల ఆలయంలో రంగనాయకస్వామితోపాటులక్ష్మి,గణపతి,శివుడు,వీరబ్రహ్మేంద్రస్వామి,సిద్దప్పపూజలందుకొంటున్నారు. ఇంకా పార్వతీసమేత ఉమామహేశ్వరస్వామి, కుమారస్వామి,శ్రీలక్ష్మీవేంకటెశ్వర స్వామి విగ్రహాలకు కూడా భక్తులు పూజలు చేస్తుంటారు.
ఉత్సవాలు : రంగనాయకస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవం, కళ్యాణోత్సవం,తెప్పోత్సవం వైభవంగా జరుగుతాయి.చైత్ర శుద్ధ పున్నమ,బహుళ పాడ్యమి,విదియలలో మూడురోజుల పాటు ఉత్సవాలు జరుపుతారు.
నిష్ఠ తప్పితే తేనెటీగల దాడి : ఈ ఆలయానికి వెళ్లే భక్తులు అత్యంత నియమ నిష్ఠలు పాటించాలి.అంటు,ముట్టు ఉన్న వారు వెళితే స్వామి దర్శనం లభించదని చెబుతారు. ఇలాంటి వారు క్షేత్రం దరిదాపులకు రాగానే తేనేటీగలు కుడతాయని, బయటికి తరుముతాయని చెబుతారు.అలా ఎంతోమంది స్వామి దర్శనం కాకుండానే వెనక్కి వెళ్తుంటారు.మరోసారి మరింత నిష్ఠతో స్వామిని దర్శించుకుంటారు. అందువల్లనే ఈ క్షేత్రంలో దొంగతనాలు, దోపిడీలు లాంటి చర్యలు కూడా ఇక్కడ జరుగవని భక్తులు చెబుతున్నారు.
ఎలా వెళ్లాలంటే : గిద్దలూరు నుండి రాచర్ల అనుములపల్లె వయా పుల్లల చెరువు మీదుగా అలాగే గిద్దలూరు నుండి వెళ్ళుపల్లె జయరాంపురం మీదుగా మార్కాపురం కంభం నుండి వెళ్ళు వారు తురిమెళ్ళ వయా చోళ్లవీడు మీదుగా బస్సులు, ఆటోలో వెల్లెచ్చు.
Leave a Reply